ఏం చదివినా వైద్యరంగంలో భవిష్యత్తుకు భరోసా! 12 d ago
ఏ తరహా విద్యా నేపథ్యం ఉన్నవారినైనా అక్కున చేర్చుకుంటున్నది ఆరోగ్య పరిరక్షణ రంగం, ఏటా 25% వృద్ధి రేటుతో విస్తరిస్తోంది. దీనికి రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మెడికల్ విద్యార్హతలు ఉన్నవారికి ప్రధాన ద్వారం, ఇతర విద్యా నేపథ్యాలున్న యువతకు మరో ద్వారం స్వాగతం పలుకుతోంది. పనికోసం నిరీక్షణ, లేఆఫ్స్, ఆర్థిక మాంద్యానికి సంబంధించిన సమస్యలు లేకపోవడంతో ఐటీ సహా వివిధ కోర్సులు చేసినవారు ఈ రంగంపై ఆసక్తి చూపిస్తున్నారు.
భారత ఆరోగ్య పరిరక్షణ రంగంలో 75 లక్షల మంది పనిచేస్తున్నారు. టెక్నాలజీ ప్రవేశంతో రానున్న సంవత్సరాల్లో 3 లక్షల నుండి 3.5 లక్షల మంది నిపుణులు అవసరమవుతారు. టెలీ మెడిసిన్, వర్చువల్ అసిస్టెంట్స్, డేటా అనలిటిక్స్ విభాగాల్లో ఈ కొరత ఏర్పడుతుందని అంచనా. 2030 నాటికి ఈ రంగం వృద్ధి రేటుతో మరో 6 లక్షల కొలువులు ఉత్పన్నమవుతాయని భావిస్తున్నారు.
వైద్య ఆరోగ్య రంగంలో, ఏ హాస్పిటల్ కి వెళ్లినా ఫిజిషియన్లు, పిడియాట్రిషన్లు, సర్జన్లు, అనస్తీషియాలజిస్టులు, సైకియాట్రిస్టులు, రేడియాలజిస్టులు, ఆర్థోపెడిక్ సర్జన్లకు మంచి డిమాండ్ ఉంది. ఇటువంటి వైద్య నిపుణులకు అత్యధిక వార్షిక ప్యాకేజీలను కార్పొరేట్ ఆస్పత్రులు ఆఫర్ చేస్తున్నాయి. ఇంకా ఈ రంగంలో అధిక ఆదాయం పొందే వారిలో కార్డియాలజిస్టులు, న్యూరో సర్జన్లు, ఆంకాలాజిస్టులు, పల్మోనాలజిస్ట్లు కూడా ఉన్నారు.